జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే దక్షిణాఫ్రికాకు విజయం సొంతం కానుంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాన్ డర్ డసెన్(11) ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం ఖాయం. టీమ్ఇండియా బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 266 పరుగులకే పరిమితమైంది భారత్. రహానే (58), పుజారా (53) అర్ధశతకాలతో రాణించారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. చివర్లో విహారి (40*) పోరాడటం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు పరిమితమైన భారత జట్టు.. సఫారీల ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జోహన్నెస్‌బర్గ్‌లో ఇప్పటివరకు 220కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు సౌతాఫ్రికా. 2006లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై 220 పరుగుల్ని ఛేదించి విజయం సాధించింది సఫారీ జట్టు. ఈసారి దాన్ని అధిగమిస్తుందో చూడాలి మరి.