కోహ్లీ-బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వీరిద్దరి వివాదం గురించి మరో విషయం బయటకు వచ్చింది. కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు దాదా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు.
గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఆ సమయంలో విరాట్‌తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ తెలిపాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు.
విరాట్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు గంగూలీకి కోపం తెప్పించాయని, దీంతో అతడికి షోకాజ్ నోటీసులు పంపించాలని అనుకున్నట్లు సదరు ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయమై దాదా.. బీసీసీఐ సభ్యులతో కూడా చర్చించాడని చెప్పారు. అయితే బోర్డు సభ్యులందరూ కలిసి.. ఈ వివాదం పెద్దది చేయొద్దని సూచించడం వల్ల దాదా తన ఆలోచనను విరమించుకున్నాడని పేర్కొన్నారు.