Kerala |రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి తోటి ప్రయాణికుడికి నిప్పటించండంతో మంటలు పక్కన వాళ్లకు వ్యాపించి మొత్తం ముగ్గురు మృతిచెందారు. ఆదివారం అర్థరాత్రి కోజికోడ్ జిల్లా ఎలత్తూర్ సమీపంలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలప్పుళ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి 9.45 గంటలకు కోజికోడ్ నగరం దాటి కొరపుజా రైల్వే బ్రిడ్జి దాటుతుండగా డీ1 కాంపార్ట్‌మెంట్‌లో ఎర్ర చొక్కా, టోపీ ధరించి ఉన్న ఓ వ్యక్తి, తోటి ప్రయాణికులపై రెండు బాటిళ్ల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో డీ1 బోగీలో చెలరేగిన మంటలు డీ2 కంపార్ట్‌మెంట్‌కు కూడా వ్యాప్తించాయి.
భయాందోళనకు గురైన ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపారు. ఈ నేపథ్యంలో దాదాపు 35 ఏళ్ల వయసున్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనలో 9 మంది క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించినట్లు కోజికోడ్ నగర పోలీసు కమిషనర్ రాజ్‌పాల్ మీనా తెలిపారు. అయితే, ఇందులో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి, తన బంధువుల్లో ఓ చిన్నారి, మరో మహిళ కనిపించడం లేదని అన్నాడు. ఈ విషయమై పోలీసులు రైలు పట్టాలను పరిశీలించగా, ఆదివారం అర్ధరాత్రి కేరళ(Kerala) లోని ఎలత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఓ చిన్నారి, మహిళ సహా, మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Read Also: రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ
Follow us on: Google News, Koo, Twitter