టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకునే పసుపు సంబరాలకు రాజమహేంద్రవరం(Rajamahendravaram) సిద్ధమైంది. నేడు, రేపు అట్టహాసంగా మహానాడు(Mahanadu) సమావేశాలు జరగనున్నాయి. దీంతో నగరమంతా పసుపు జెండాలతో నిండిపోయింది. రాజమహేంద్రి శివార్లలోని వేమగిరి ఇందుకు వేదికైంది. తొలి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అందులోనూ ఈసారి ఎన్టీఆర్(NTR) శతజయంతి కావడంతో పాటు ఎన్నిలక ఏడాది కావడంతో ఈసారి మహానాడు సమావేశాలు మరింత ఘనంగా పార్టీ జరిపించనుంది. ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితోపాటు కార్యకర్తలు కూడా భారీగా హాజరుకానున్నారు. అందుకు వీలుగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు.
తొలిరోజు ప్రతినిధుల సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడుని సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం 21 తీర్మానాలు మహానాడు(Mahanadu)లో చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్‌కు, ఆరు తెలంగాణకు సంబంధించినవి. మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు భావ సారూప్యం ఉన్న పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చిన అతిథులతో పాటు కార్యకర్తలకు గోదావరి రుచులు చూపిచనున్నారు. మహానాడు సందర్భంగా 1,200 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.