Potato Onion Politics |శుక్రవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన సీఎం జగన్.. వరద బాధితులతో సమావేశమయ్యారు. అనంతరం వారికి అందిస్తున్న పరిహారం గురించి మాట్లాడుతూ 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. వారు బంగాళాదుంప అని చెప్పారు. దీంతో జగన్‌పై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీఎం జగన్‌కు బంగాళదుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ-జనసేన, వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది. సీఎం జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదా అంటూ మీమ్స్. వీడియోలతో హల్‌చల్ చేస్తున్నారు. ఇందుకు వైసీపీ అభిమానులు కూడా రాయలసీమలో పొటాటోను ఉల్లగడ్డ అంటారని ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.
Potato Onion Politics | “బంగాళదుంపని రాయలసీమలో ఉల్ల గడ్డ అని పిలుస్తారు. అలానే ఉల్లిపాయని ఎర్రగడ్డ అని పిలుస్తుంటారు. సీమలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు, అలాంటిది మేం రాయలసీమ వాసులం అని చెప్పుకునే మీ చంద్రబాబుకి, మీకు ఆ విషయం తెలియకపోవడం మీకు సీమ యాస, భాష పట్ల ఏమాత్రం జ్ఞానం ఉందో అర్ధమవుతుంది. అది రాయలసీమ యాస, భాష.. దాన్ని మీరు గుర్తించలేదు కాబట్టే 2019 ఎన్నికల్లో మీకు 3 సీట్లు వచ్చాయి” అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
ఇందుకు టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ “సీమలో అయితే “ఉల్ల గడ్డ” అనే అంటారు. మీ వాడికి అది తెలియదు కాబట్టే “ఉల్లిగడ్డ” అంటాడు. మళ్ళీ రాయలసీమ ముద్దు బిడ్డ అని డబ్బులిచ్చి డప్పు. మీ వాడికి సీమలో పలికే ఉల్లగడ్డ తెలియదు, ఆంధ్రాలో పలికే బంగాళదుంప తెలియదు. నీకు అసలు ఏ యాసా తెలియదు. అందుకే కాస్తో ఇస్కిస్తో లాంటి కొత్త పదాలు కనిపెట్టాడు. గడ్డ ఏదో, దుంప ఏదో తెలియకే కదా, ప్రజల నోట్లో మట్టి గడ్డలు కొట్టాడు. దమ్ము గురించి, పరదాలు కప్పుకుని తిరిగే మీరే చెప్పాలి” అంటూ ట్వీట్ చేసింది.