Chandrababu – Pawan Kalyan | ఏపీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పర్యనటకు వచ్చిన సీఈసీ బృందాన్ని ఈ మేరకు కలిశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం కేసులతో వేదిస్తోందని మండిపడ్డారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని అధికారులను కోరినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లు తొలగించడం సరికాదని చెప్పామన్నారు. గతంలో సాక్షాత్తూ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితి ఏర్పడిన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
Chandrababu – Pawan Kalyan | ఇక పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతుందని, వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించొద్దని సీఈసీకి తెలియజేశామన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నామినేషన్ వేసే పరిస్థితికూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన విషయాన్ని కూడా సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా వివరించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన చెప్పుకొచ్చారు. తమ విజ్ఞప్తులపై ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. కచ్చితంగా ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని.. ప్రభుత్వం కూడా మారుతుందని వెల్లడించారు.