మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“నేను చాలామందిని చూశాను. కానీ ప్రజలకు సిన్సియర్‌గా ఏదో చేయాలనే తపన ఉన్న నాయకుడు రాధాకృష్ణ. ఏమీ కోరడు… మామూలుగా అయితే చాలామంది తండ్రి పేరు అడ్డంపెట్టుకుని పదవులు ఆశిస్తారు. రాధాకృష్ణ మాత్రం నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. రాధాకృష్ణ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళుతున్నాడు… దూసుకుపోతున్నాడు.
తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తనను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకూడదని నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు వంగవీటి రాధాకృష్ణ. ఈ దెందులూరులో ఇవాళ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రానికి రాధాకృష్ణ సేవలు అవసరం. ఆయనకు తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాది” అని చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. కాగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా రాధా రాష్ట్రమంతా కూటమి అభ్యర్థులు తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
అలాగే సీఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. తానేదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నానని జగన్, ఆయన భార్య, ఏ2 విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘వీళ్లకు తప్పుడు ప్రచారం అలవాటైపోయిందని, ఆ నోటికి గట్టిగా వాత పెట్టి, శాశ్వతంగా మూసేస్తే తప్ప సిగ్గురాని మనుషులు’ అంటూ ఘాటుగా స్పందించారు. మీరు చేసే హత్యా రాజకీయాలను మాపై నెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే! ఇక్కడ దెందులూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు పులివెందులో ఉన్నాయి? నువ్వే కారణం.. అవునా, కాదా?” అంటూ నిలదీశారు.