టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో సాగుతున్న పాదయాత్ర తేటిగుండ వద్దకు వచ్చేసరికి 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దీంతో రాజులకొత్తూరులో ఆయన సతీమణి బ్రాహ్మణి(Brahmani), కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna), చిన్న అల్లుడు భరత్, ఇతర టీడీపీ నేతల సమక్షంలో ఆయన 3వేల కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లోకేష్ ట్వీట్ చేస్తూ ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను’అని తెలిపారు.
కాగా ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్ పాదయాత్ర(Yuvagalam Padayatra) మొదలుపెట్టారు. ఇప్పటివరకు 10 జిల్లాల మీదుగా 92 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది. ఇక ఈనెల 20న భోగాపురం మండలం పోలిపల్లిల్లో పాదయాత్ర ముగియనుంది. ఇక ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్, షర్మిల మాత్రమే 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు వారి సరసన లోకేష్ కూడా చేరారు.