సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర సోమవారం ఉదయం పున:ప్రారంభమైంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించారు. ఈ యాత్రలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు ఎక్కడికి పారిపోయినా వదిలే ప్రసక్తే లేదని లోకేశ్ వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను జైలుకు పంపితే పాదయాత్ర ఆగుతుంది అనుకున్నారని.. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని స్పష్టంచేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారని ఆరోపించారు. తనపై కూడా సీఐడీ ఇప్పటి వరకూ 6 కేసులు పెట్టినా ఒక్క ఆధారం చూపించలేదన్నారు. రాష్ట్రంలో యుద్ధం మొదలైందని.. మూడు నెలల్లో సైకో జగన్‌ను పిచ్చాస్పత్రికి పంపిస్తానని తెలిపారు. యువగళం జరగనిస్తే పాదయాత్ర.. లేకపోతే దండయాత్ర అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ బస్సు యాత్ర కాస్త తుస్ యాత్ర అయిందని.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని పట్టించుకనే వారే లేరని లోకేశ్(Nara Lokesh) సెటైర్లు వేశారు.