టీడీపీ యువనేత చేపట్టిన లోకేశ్ యువగళం(Yuvagalam) పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రను ముగించారు. ఇవాళ ఉదయం గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి ప్రారంభించిన పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం(Vastunna Meekosam)’ పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్రను లోకేశ్ కూడా ముగించారు.
ఇక ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం(Yuvagalam) విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సభ నుంచే టీడీపీ-జనసేన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి.
కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. 226 రోజుల పాటు మొత్తం 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 3,132 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. మధ్యలో నందమూరి తారకరత్న ఆకస్మిక మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లాంటి సందర్భాల్లో తప్ప విరామం లేకుండా పాదయాత్ర కొనసాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాదయాత్రకు 79 రోజుల విరామం ప్రకటించాల్సి వచ్చింది.