Btech Ravi |మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో లైంగిక వేధింపుల అంశం తెరపైకి రావడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా ఎన్ని కథలు అల్లుతారంటూ మండిపడుతున్నారు. మొదట గుండెపోటు అని, తర్వాత మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) చంపించారని, అనంతరం వివేకాకు ముస్లిం మహిళతో సంబంధం ఉందని, ఇప్పుడేమో నిందితుడి తల్లిని లైంగికంగా వేధించారని కట్టు కథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వివేకాను చిత్ర హింసలకు గురిచేసి చంపేసిన వారు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపై తీవ్రంగా బురద జల్లుతున్నారని టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి(Btech Ravi ) ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ(CBI) దర్యాప్తు అవసరమన్న జగన్.. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పోరాటం చేస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని.. ఇప్పుడు ఆమెపైనా నిందలేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.