ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు టీడీపీ అండగా ఉంటుందని యువనేత నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. “పాలకుల అవినీతిని, అసమర్ధతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి(Margadarsi) సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి(YS Jagan) శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే… ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోంది.
ఇదంతా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టండి. రాజధాని అమరావతి(Amaravati)ని నిర్మించండి. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన YCP నేతల పై చర్యలు తీసుకోండి. అంతేకానీ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి. రామోజీరావు గారికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది” అని లోకేశ్(Nara Lokesh) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు #TeluguPeopleWithRamojiRao అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు.
కొంతకాలంగా ఏపీలోని మార్గదర్శి సంస్థల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనాడు అధినేత రామోజీరావు(Ramoji Rao), మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్(Sailaja Kiran) ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ఆదేశించింది. అయినా కానీ సీఐడీ అధికారులు శైలజా కిరణ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల్లో సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. కోర్టు ఆదేశాలు ఉన్నా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.