15 ఏళ్ల క్రితం విడాకులు : ఆ జంటకు ఇప్పుడు మళ్లీ పెళ్ళి

0
107

చిన్న చిన్న కారణాలతో పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటారు చాలా మంది. ఏ సమస్య వచ్చినా కుటుంబంలో విడాకులే పరిష్కారం అనుకుంటారు. మొగుడు పెళ్లాలు విడిపోతుంటారు. సర్దుకుపోయే అలవాటు నేటి దంపతుల్లో లోపించింది. ఆధునికత పేరుతో ఒంటరి జీవితం గడుపుతూ జీవిత చరమాంకంలో నరకం అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఒక గుణపాఠం లాంటిది ఈ ఘటన.

ఒంటరితనం ఎంత నరకమో ఆ జంట అనుభవించింది. 15 ఏళ్ల క్రితం వారు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆ దంపతులే మళ్లీ ఒక్కటి కానున్నారు. అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు తాము చేసిన తప్పులు నేటికి గ్రహించారు. ఒంటరితనం తమను ఎంతగా వేధించిందో గమనించి పాత దంపతులే లేటు వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఒక జంట (భర్త వయసు 70 ఏళ్లు) పెళ్లి తర్వాత 20 ఏళ్లపాటు సంసారం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సంపారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఎవరి బతుకు వారే బతుకుదామని నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ కలిసి న్యాయస్థానంలో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. విడాకుల తర్వాత ఇద్దరూ 15 ఏళ్లు ఎవరికి వారే ఒంటరి జీవితం గడిపారు. వయోభారం, వంటరితనం వారి జీవితం నరకమయం చేసేశాయి.

15 ఏళ్ల క్రితం ఏ కోర్టులో అయితే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారో.. అదే కోర్టు ద్వారా మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసే కోర్టును ఆశ్రయించారు. వారి సమస్యను సదరు న్యాయస్థానం లోక్ అదాలత్ కు పంపించింది. హిందూ వివాహ చట్టం 15 వ సెక్షన్ ప్రకారం వారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి లోక్ అదాలత్ బెంచ్ రెండు రోజుల క్రితం అనుమతించింది. వచ్చే వారమే ఆ పాత జంట మళ్లీ పెళ్లితో ఒక్కటి కాబోతున్నది. ఈ పరిణామంతో విదేశాల్లో ఉన్న వారి పిల్లల్లో ఆనందానికి హద్దులు లేకుండాపోయింది.