టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva)కు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే స్వాతి పత్రికలో వచ్చిన తన కథ ఆధారంగా ‘శ్రీమంతుడు(Srimanthudu)’ సినిమాను కొరటాల శివ తీశారని శరత్ చంద్ర(Sharat Chandra) అనే రచయిత ఏడేళ్ల క్రితం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను తెలంగాణ హైకోర్టులో కొరటాల సవాల్ చేశారు. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
చివరకు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో కొరటాల(Koratala Siva) సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు తీర్పు స్పష్టంగా ఉందని.. ఇందులో తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని పేర్కొంది. పిటిషన్‌ను డిస్మిస్ చేయమంటారా? మీరే వెనక్కి తీసుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను నిరంజన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు.