జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జమ్మూకశ్మీర్.. ఎన్నికలనే చదరంగంలో గెలవడానికి ఒక పావు మాత్రమేనని ప్రియాంక అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేయాలన్న తమ ఆటలో జమ్మూకశ్మీర్‌ను బీజేపీ ఒక పావుగా వాడుకుంటుందని విమర్శించారు ప్రియాంక. జమ్మూకశ్మీర్ ప్రజలను తమ అబ్బద్ధాలతో మభ్యపెట్టాలని మోదీ, అమిత్ షా చూస్తున్నారంటూ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌పై వారికి ఒక క్లారిటీ లేదని, కానీ కాంగ్రెస్ అలా కాదని వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
‘‘మీకు రాష్ట్ర హోదా కావాలంటే మాకు ఓటేయండని అమిత్ షా(Amit Shah) అడగడం విడ్డూరంగా ఉంది. అసలు రాష్ట్రహోదాను లాక్కుందే వాళ్లు కదా. మీ టీవీ ఎత్తుకెళ్లి.. టీవీ కావాలంటే నన్ను అడగండి నేను ఇస్తా అన్నట్లుఉంది బీజేపీ వ్యవహారం. జమ్మూకశ్మీర్‌పై మోదీకి ఇసుకరేణువంత కూడా ప్రేమలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేశమంతా భావోద్వేగాలను రగల్చడానికి జమ్మూకశ్మీర్‌ను ఒక కాగడాలా వాడుకుంటున్నారు’’ అని ప్రియాంక(Priyanka Gandhi) విమర్శించారు.