అలెర్ట్..తాగునీటి విషయంలో కేంద్రం కొత్త రూల్స్..అవేంటంటే?

0
44

మనకు మంచినీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పలేం. నీరు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, సులువుగా, సౌకర్యవంతంగా నీళ్లు తీసుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలతో ముసాయిదాను రూపొందించింది.

కొత్త మార్గదర్శకాలు ఇవే..

గర్భిణులు, చిన్న పిల్లలున్న తల్లులు, తాత్కాలికంగా శారీరక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అనుకూలంగా ఉండేలా తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేయాలి.

చిన్నపిల్లల కోసం 500-700 మి.మీ.లు; వీల్‌ఛైర్‌ వినియోగించే దివ్యాంగుల కోసం 850 మి.మీ.ల ఎత్తులో కుళాయిలు ఉండాలి. అవసరం మేరకు రెండు రకాల ఎత్తుల్లోనూ ఏర్పాటు చేయాలి.

అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, మాధ్యమిక, రెసిడెన్షియల్‌ పాఠశాలలు; అన్నిరకాల వైద్య, ఆరోగ్య కేంద్రాలు; ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాలు, మార్కెట్‌లు వంటి చోట్ల ఈ నిబంధనలు అమలు చేయాలి.

చిన్నపిల్లలకు కూడా సులువుగా అందుబాటులో ఉండేలా తాగునీటి పాయింట్లు (ఎత్తు, అనువైన ప్రాంతం) ఉండాలి. అలాగే స్వల్ప లేదా పాక్షిక దృష్టి లోపం ఉన్నవారికి అనుగుణంగా వాటికి రంగులు వేయాలి.

కుళాయిలను చేతితో తిప్పాల్సిన అవసరం లేకుండా పాదాలతోనే ఆపరేట్‌ చేయగలిగేలా పెడళ్లను ఏర్పాటు చేయడం.

తాగునీటి పాయింట్ల వద్ద అనుకూలంగా ఉండేలా హ్యాండిళ్లు వంటివాటిని అమర్చడం.

ఆటోమేటిక్‌ సెన్సర్లు, బ్రెయిలీ లిపిలో సూచికలు పెట్టడం వంటివన్నీ ముసాయిదాలో ఉన్నాయి.