కర్ణాటకలో హిజాబ్ వివాదంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నేడు కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం అవుతాయని సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. 1-10 తరగతులకు ఫిబ్రవరి 14 (సోమవారం) నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
హిజాబ్ వివాదంపై తుది తీర్పు వచ్చే వరకు విద్యాసంస్థల్లో మతపరమైన వస్త్రధారణ వద్దని సూచించారు. రాష్ట్రంలో రెండ్రోజులుగా పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.