తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని ఏపీ పోలీసులకు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తనకు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తనతో పాటు తన కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ సందర్భంగా యామినిని పలకరించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన ఫేస్ బుక్ అధికారిక పేజీ సాధినేని యామినీ శర్మ పేరిట ఉందని చెప్పారు. ఇది కాకుండా, ‘యామిని సాధినేని’, ‘యామిని సాధినేని యువసేన’.. ఇలా ‘ఫేస్ బుక్’ లో ఫేక్ అకౌంట్స్ ను సృఫ్టించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, ఇతర నాయకులపై అసభ్య పదాలు వాడుతూ తాను చేసినట్టుగా ఈ పోస్టింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్ట్ లను నిజంగా తానే చేశానని నెటిజన్లు భావిస్తూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.