‘బడి బాట’లో హెచ్ఎం వినూత్న నిరసన..ఎండలో నేలపై పడుకొని..

0
40

ప్రస్తుతం తెలంగాణాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని  ప్రొఫెసర్‌ జయంశంకర్‌ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో చేరాలంటూ 30వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. దీనితో ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలను బడిలో చేర్పించే పనిలో పడ్డారు.

తాజాగా ఓ ప్రధానోపాధ్యాయుడు బడి మానేసిన పిల్లలు బడిలో చేరాలని వినూత్న రీతిలో వారి వారి ఇళ్ల వద్ద నేలపై పడుకొని నిరసన తెలిపాడు. పిల్లలను బడికి పంపే వరకు తిరిగి వెళ్ళేదే లేదంటూ తల్లిదండ్రులను వేడుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఫుల్ కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో చోటు చేసుకుంది.

జిల్లా ప్రజా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు నూలి శ్రీధర్ రావు తోటి ఉపాధ్యాయులతో బడి మానేసిన పిల్లల ఇంటికి వెళ్లారు. గత సంవత్సరం ఇద్దరు అన్నదమ్ములు 8వ తరగతి పూర్తి చేసుకొని 9వ తరగతిలో చేరాల్సి వుంది. అయితే అందులో ఒకరు బాల కార్మికునిగా మారగా..మరొకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరితో పాటు ఇంకొంత మంది విద్యార్థులు బడిలో చేరలేదు. దీనితో హెచ్ఎం శ్రీధర్ వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా వారి తల్లిదండ్రులు వినకపోవడంతో నేలపై పడుకొని ఇలా నిరసన తెలిపారు. చివరకు విద్యార్థులు పాఠశాలలో తిరిగి చేరగా..గ్రామస్థులు హెచ్ఎం ను అభినందించారు.