IPL-2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 వేలం రసవత్తరంగా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఆటగాళ్ల ఆక్షన్ జరిగింది. మొత్తం 405 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో 51 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ల పంట పండింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ రూ.18.50 కోట్లతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. మరో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి(IPL-2023 Auction) అత్యధికంగా 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్ దాగర్ పాల్గొనగా.. హైదరాబాద్ జట్టు దక్కించుకున్నది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఆల్ రౌండర్ మయాంక్ దాగర్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య గట్టి పోటీ జరిగింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు ఉండగా… హైదరాబాద్ జట్టు రూ.1.8 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. మయాంక్ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో మయాంక్ 7వ నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరి ఐపీఎల్ లో ఎంతమేరకు రాణిస్తాడో వేచి చూడాలి.