పదో తరగతి విద్యార్థుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టై జైళ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పార్టీ శ్రేణులకు కీలక సందేశం పంపించారు. ఈ మేరకు జైలు నుంచి లేఖ రాశారు. ‘బీజేపీ కార్యకర్తలు.. భరతమాత ముద్దు బిడ్డలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ స్థాపించి నేటికి 43 ఏళ్లయింది. నాలుగు దశాబ్దాల కాలంలో బీజేపీ(BJP) ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. పార్టీ కోసం ఎంతోమంది తమ జీవితాలనే త్యాగం చేశారు. మరెందరో తమ ప్రాణాలను అర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొదలు వాజ్‌పేయి వరకు ఎంతోమంది మహా నేతలు తమ సర్వస్వాన్ని పార్టీ కోసం ధారపోశారు. మన రాష్ట్రంలో డీఎన్ రెడ్డి మొదలు చలపతి రావు, రామారావు, టైగర్ నరేంద్ర లాంటి ఎంతోమంది జీవిత కాలమంతా పార్టీ కోసం పనిచేశారు. జితేందర్ రెడ్డి వాళ్లు నక్సలైట్లకు ఎదురొడ్డి పార్టీ కోసం పనిచేస్తూ తూటాలకు బలయ్యారు.
ఎంతోమంది నేతలను ఏళ్ల తరబడి జైళ్లో పెట్టినా అదరలేదు. బెదరలేదు. సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడారు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా బీజేపీకి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు.. మహోన్నతమైన భారతీయ సమాజం నిర్మాణమే అంతిమ లక్ష్యం. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పినట్లుగా ఆ లక్ష్య సాధన కోసం జీవిత కాలం పట్టినా పరవాలేదు.. చివరకు ప్రాణం పోయినా పరవాలేదు.. వచ్చే జన్మలోనూ ఆ లక్ష్య సాధన కోసమే పనిచేద్దాం. ఈ క్రమంలో గిట్టని పార్టీలు, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనమీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడతాయి. నాపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్(KCR) కొడుకు పాత్రను ఎత్తి చూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాల పక్షాన గళమెత్తుతూ అలుపెరగకుండా బీజేపీ చేస్తున్న ఉద్యమాలను నిలువరించేందుకు, కార్యకర్తలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రభుత్వం నాపై టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు మోపి జైలుకు పంపింది.’ అని బండి(Bandi Sanjay) లేఖలో పేర్కొన్నారు.
Read Also: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter