ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను(Assigned Land) లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేస్తున్నారని, దీన్ని ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని లేఖలో డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే రియల్ వ్యాపారం కోసం ఆ భూములను లాక్కోవాలని చూడడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమేనని ఆయన పేర్కొన్నారు.
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానంటూ హామీలివ్వడమే కానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారులు వెంచర్ వేసింది దళితుల భూముల్లోనేనని ఆయన ఆరోపించారు. శంషాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనేనని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి నుంచి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని బండి(Bandi Sanjay) ప్రశ్నించారు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదని, వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమని సంజయ్ పేర్కొన్నారు.
Read Also: భారత ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీలదే కీలక పాత్ర: షా
Follow us on: Google News, Koo, Twitter