సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. అక్కడ తెలంగాణ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎంపీ, హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు(Sai Sindhu Foundation) రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి భూమి కేటాయించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని భూములను సీఎం కేసీఆర్(KCR) ఆదాయ వనరుగా చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దగ్గర కనీసం లక్ష కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలు వచ్చినా వందల కోట్లు ఖర్చుపెట్టడం ద్వారా ప్రజా తీర్పును కొనుగోలు చేద్దామన్న ఆలోచన చేస్తున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడాలనే ఆలోచన కేసీఆర్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. భూ దోపిడీకి పాల్పడి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి.. ఆ సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలని సీఎం కేసీఆర్ ఆలోచని అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న నిజాం భూములతో పాటు ఇతర ముఖ్యమైన భూములను తన అనుచరులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు.