Snake: రాత్రి సమయంలో ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. బిందెలో నుంచి బుసలు కొడుతున్న నాగుపామును చూసి ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్థన్నపేట పట్టణంలోని రెండో వార్డులో ఓ ఇంట్లోకి పాము ఎలా వచ్చిందో తెలియదు కానీ.. రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి చొరబడింది. ఆ నాగుపాము (Snake) బిందెలో తిష్ట వేసింది. బిందెలో నుంచి వస్తున్న బుసలను గమనించిన కుటుంబసభ్యులు భయపడుతూనే.. లోపల ఏముందో అని చూడగా.. ఒక్కసారిగా పామును చూసి షాక్ తిన్నారు.
రాత్రి సమయంలో స్నేక్ క్యాచర్‌ను పిలిచినా వస్తారో లేదో అన్న అనుమానంతో.. పామును ఉదయం వరకు బిందెలోనే ఉంచేశారు. కాకపోతే పాము బయటకు రాకుండా బిందెపై బండను పెట్టి.. పాము ఎటూ కదలకుండా చేశారు. ఇక ఎప్పుడు తెల్లవారుతుందా అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. తెల్లవారగానే.. బిందెతో సహా పామును బయటకు తీసుకువచ్చారు. అనంతరం పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. పాములు పట్టే వ్యక్తి నాగుపామును చాకచక్యంగా పట్టుకొని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో సదరు కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read also: తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన