కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆయనకు నచ్చజెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు. మీరు చేసిన దీక్షలు వృథాగా పోవని, కడప ఉక్కు పరిశ్రమ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ, జనసేన, బీజేపీలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓ వైపు జనసేనాని పవన్ కల్యాణ్, మరోవైపు వైసీపీ అధినేత జగన్‌లు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడతానంటోన్న పవన్ మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని మండిపడ్డారు.