స్వీడన్ మెరిసెన్

స్వీడన్ మెరిసెన్

0
420

1-0 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం
హంగు ఆర్భాటం కానరాలేదు.. మెరుపులు ..స్టార్ తళుకులు లేవు.. అంతా సాదాసీదాగా..అంతకుమించి ఓ పాత సినిమా చూస్తున్న ఫీలింగ్.. ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్..స్విట్జర్లాండ్ మధ్య పోరు సందర్భంగా కనిపించిన దృశ్యం.. పూర్తి రక్షణాత్మకశైలితో ఆడే రెండుజట్ల మధ్య పోరాటంలో తుదకు స్వీడన్‌దే పై చేయిగా మారింది. స్విట్జర్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించి ఏకైక గోల్‌తో విజయం సాధించి క్వార్టర్స్ చేరింది.
24
1994 యూఎస్‌ఏలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ అనంతరం మల్లీ 24 ఏండ్ల తర్వాత స్వీడన్ క్వార్టర్స్ చేరింది.

సెయింట్ పీటర్స్‌బర్గ్(రష్యా): పడుతూ లేస్తూ సాగుతున్న స్వీడన్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకేసింది. అసమాన పోరాటంతో నాకౌట్ చేరిన స్వీడన్ జట్టు.. రెండోరౌండ్‌లో స్విట్జర్లాండ్ రూపంలో ఎదురైన కఠిన ప్రత్యర్థిని ఓడించి క్వార్టర్‌ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో 1-0 గోల్స్‌తో స్విస్ అడ్డంకిని అధిగమించి 1994 తర్వాత మళ్లీ ప్రపంచకప్ క్వార్టర్స్ చేరింది. మ్యాచ్ (66వ నిమిషంలో) స్వీడన్ మిడ్‌ఫీల్డర్ ఎమిల్ ఫోర్స్ బెర్గ్ గోల్ సాధించి జట్టుకు విజయాన్నందించాడు.

ఆధిపత్యం అంతా స్విస్‌దే..
మ్యాచ్‌లో బంతి 63శాతం స్విట్టర్లాండ్ ఆధీనంలో కొనసాగింది. అంతేకాదు స్వీడన్ గోల్‌పోస్టుపై 18 సార్లు దాడులు చేసింది. అంతేకాదు 11 కార్నర్‌లు సాధించినా పటిష్ఠమైన స్వీడన్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. కాగా.. స్వీడన్ కేవలం 37 శాతం మాత్రమే బంతిని అధీనంలోకి తీసుకున్నా.. స్విస్ డిఫెన్స్‌ను ఛేదించడంలో వారిదీ అదే దారి. స్వీడన్ దాడులను నియంత్రిస్తూ తగిన అవకాశం కోసం ఎదురుచూసింది. రెండుజట్ల మధ్య ఎలాంటి గోల్స్ నమోదు కాకుండానే ప్రథమార్ధం ముగిసింది. రెండొ అర్థభాగంలోనూ అదే పరిస్థితి. అప్పుడు తగిన సమయంలో లభించిన అవకాశాన్ని ఫోర్స్‌బెర్గ్ సద్వినియోగం చేశాడు. స్విస్ పెనాల్టీ ఏరియా సమీపంలో కచ్చితమైన టైమింగ్‌తో కొట్టిన షాట్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ సోమర్ అడ్డుకోలేకపోవడంతో బంతి వెళ్లి గోల్‌పోస్టులో పడింది. మ్యాచ్ చివరివరకు ప్రయత్నించినా స్విట్జర్లాండ్ జట్టు గోల్ చేయలేకపోవడంతో విజయం స్వీడన్‌దే అయింది.