వేట షురూ… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రేవంత్ రెడ్డి తొలి దెబ్బ

0
91

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధిగా ఎంపికైన రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. పిసిసి చీఫ్ గా ప్రకటన రాగానే ఆయన ప్రధాన టార్గెట్లలో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేశారు. పలు సభల్లో, మీడియా సమావేశాల్లో ఆయన ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గానే చెప్పారు. ఇందులో భాగంగానే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ముహూర్తం ఖరారు చేశారు.

రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎఐసిసి స్పందించింది. పార్టీ అధిష్టానం శనివారం కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు జారీ చేసింది. ఎఐసిసి ఇన్ఛార్జి మనిఖ్కమ్ ఠాగూర్ ఈ మేరకు సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు పంపించారు. తర్వాత ఆయన ఇచ్చే జవాబునుబట్టి న్యాయస్థానాల్లో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. ఈ నోటీసు మనిక్కం ఠాగూర్ వ్యక్తిగతమైనదే అయినప్పటికీ రేవంత్ రెడ్డి సూచనతోనే పంపినట్లు తెలుస్తోంది.

లీగల్ నోటీసులో ఏముందంటే…

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మనిక్కమ్ ఠాగూర్ న్యాయవాది ఆర్. అరవిందన్ లీగల్ నోటీస్ జారీ చేశారు. జులై 3వ తేదీన టిఆర్ఎస్ ఎల్పీ లో పెట్టిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్ష నియామకంలో మనిక్కమ్ ఠాగూర్ 25 కోట్లు తీసుకున్నారని సుధీర్ రెడ్డి నిరాధార, అసత్య ఆరోపణలు చేసారు. ఎంతో నిజాయితీగా రాజకీయాలలో తన ప్రతిష్ట పెంచుకున్న మనిక్కమ్ ఠాగూర్ ఈ అబద్ధపు ప్రకటనతో పరువు దెబ్బతిన్నది. ఈ విషయంలో వారం రోజులలో మనిక్కమ్ ఠాగూర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు న్యాయవాది. లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని లీగల్ నోటీసుల్లో పొందుపరిచారు.

వారిని వదలే ప్రసక్తే లేదు : రేవంత్

కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే విషయంలో కొత్త పిసిసి చీఫ్ రెేవంత్ రెడ్డి చాలా కఠినమైన అభిప్రాయంతో ఉన్నారు. ఒకదశలో అయితే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చారు. మరో సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సుస్పష్టంగా చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నిరసన సెగలు అంటుకున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు.

ఇక రానున్న రోజుల్లో ఆ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. సుధీర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి మంచి మిత్రుడిగా ఉన్నారు. సుధీర్ రెడ్డిని ఎల్బీ నగర్ లో గెలిపించేందుకు రేవంత్ రెడ్డి తనశక్తియుక్తులను ధారపోశారని పార్టీ నేతలు చెబుతుంటారు. అటువంటి సుధీర్ రెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పుకున్నారు. అంతేకాదు… మల్కాజ్ గిరి పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన సమయంలో సుధీర్ రెడ్డి చాలా ఇరకాటంలో పడ్డారు. అటు తనకు సహకరించిన రేవంత్ రెడ్డికి ప్రచారం చేయలేక… టిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేయలేక అవస్థలు పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి గెలిచారు.

ఇప్పుడు ఈ లీగల్ నోటీసుల అంశం సుధీర్ రెడ్డితో మొదలై మంత్రి సబితారెడ్డి తో సహా ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఇస్తరా? ఎప్పుడిస్తారు? ఏం చేస్తారు అన్నది తేలాల్సి ఉంది.

legal notice to mla sudheer reddy
legal notice to mla sudheer reddy