దుబాయ్‌లో అద్భుతం జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. భారత్ ఇచ్చిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లి సేనను పాక్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. బంతితో నిప్పులు చెరిగారు. ముఖ్యంగా 21 ఏళ్ల పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ భారత్ ను వణికించాడు. మూడు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి) తీసి దెబ్బకొట్టాడు. ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది.
అంతర్జాతీయ క్రికెట్ లో నెం.1 బౌలింగ్ టీంగా గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా బౌలర్లు పాకిస్తాన్ ఓపెనర్లను సైతం అవుట్ చేయలేకపోవడం గమనార్హం. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించారు. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా పరుగులు సమర్పించడం వరకే సరిపెట్టుకున్నారు. ఫాస్టెస్ట్ బౌలర్ గా టాప్ 10లో పేరున్న బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం గమనార్హం.