పాడి కౌషిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఈటల ఎపిసోడ్ మొదలైన నాటినుంచి కౌషిక్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఈటల రాజేందర్ మీద విరుచుకుపడుతున్నారు. ఈటల ఆస్తుల మీద సిబిఐ విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
ఒకవైపు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ అంతా ఈటల విషయంలో మౌనంగా ఉంటే కౌషిక్ మాత్రం రెచ్చిపోయారు. టిఆర్ఎస్ నాయకులకంటే ఎక్కువగా ఈటలపై విమర్శలు గుప్పించారు. ఆయన తీరు చూసిన వారికి ఎవరికైనా టిఆర్ఎస్ లోకి పోతాడేమో అన్న అనుమానం కలిగేలా వ్యవహరించారు.
ఇక సీన్ కట్ చేస్తే హుజూరాబాద్ లో కౌషిక్ రెడ్డికి, కేటిఆర్ కు కామన్ ఫ్ర్రెండ్ ఇంట్లో ఒక కార్యం (మరణించిన తర్వాత జరిగే దినాలు) జరిగింది. దానికి వీరిద్దరూ హాజరయ్యారు. అయితే వీరి భేటీ చూసిన వారు ఎవరైనా కౌషిక్ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరతాడేమో అన్నట్లుగా ఉంది. కలయిక సందర్భంగా కేటిఆర్ తో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే తాను ఎందుకు, ఏ సందర్భంలో కేటిఆర్ ను కలిశాడో వివరణ ఇచ్చారు కౌషిక్ రెడ్డి. దశ దిన ఖర్మ సందర్భంగా మాత్రమే ఇద్దరం కలుసుకున్నాం తప్ప ఏరకమైన రాజకీయ ప్రత్యేకత లేదని కుండబద్ధలు కొట్టారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తలను చూసి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైనా గందరగోళానికి గురికావొద్దని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.
https://www.facebook.com/alltimereport/videos/917762645468026
మొత్తానికి ఈటల ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌషిక్ రెడ్డి టిఆర్ఎస్ అజెండా భుజానికెత్తుకుని పనిచేయడం చూసినా, కేటిఆర్ తో కలిసిన సందర్భంలో ఆయన మసులుకున్న తీరు చూసినా… ఒకింత అనుమానమైతే కలగక మానదు. సరే ఇప్పుడైతే కౌషిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ సబ్జెక్టు ప్రస్తుతానికి ఎండ్ అయింది.
గతంలో చాలామంది నేతలు పార్టీ మారే సమయంలో చేసిన కామెంట్స్ కు తర్వాత చర్యలకు తేడా ఉండేది. మరో గంటలో పార్టీ మారేవారు కూడా అస్సల్ పార్టీ మారను అనేవారు. తర్వాత సీన్ కట్ చేస్తే పక్క పార్టీ కండువాతో ప్రత్యక్షమయ్యేవారు. కానీ కౌషిక్ రెడ్డి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.