వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ నుంచి తాను తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
ప్రతి మ్యాచ్ ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్.. మోకాళ్లపై కూర్చోవడం ఇష్టం లేక మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడు. దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు వివరణ ఇచ్చాడు.
ముందుగా నా సహా ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. దీన్ని క్వింటన్ సమస్యగా చూపాలనుకోవట్లేదు. జాతివివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ సంఘీభావ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యం నేను అర్థం చేసుకోగలను. ఇలా సంఘీభావం తెలపడం ఆటగాళ్ల బాధ్యత అని కూడా తెలుసు. మోకాళ్ల మీద కూర్చోవడం వల్ల ఇతరుల జీవితాలు బెటర్‌గా ఉంటాయనుకుంటే మోకాలిపై కూర్చోవడం నాకెంతో సంతోషం. వెస్టిండీస్‌తో మ్యాచ్ నుంచి తప్పుకొని ఎవరినీ అగౌరవపరచాలని అనుకోలేదు. ముఖ్యంగా విండీస్ జట్టును. నా వల్ల బాధ పడిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నన్ను క్షమించండి. నాకు అండగా ఉన్న సహ ఆటగాళ్లకు ధన్యవాదాలు. నా దేశం కోసం ఆడటాన్ని ప్రేమిస్తాను అని డికాక్ తెలిపాడు.