ఇంగ్లాండ్​- కివీస్ అమితుమీ..గెలిచి నిలిచేదెవరు?

England - Kiwis Amitumi..who will win?

0
32

బ్యాటింగ్‌ మెరుపులు..అదరగొట్టే బౌలింగ్‌ ప్రదర్శనలు..మెరుపు ఫీల్డింగ్‌ విన్యాసాలతో అలరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ లో ఇక అసలు సిసలు సమరానికి వేళైంది. నేడే (నవంబర్ 10) నాకౌట్‌ పోరాటాలకు తెరలేవనుంది. బుధవారం తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్‌ తలపడుతుంది. దూకుడుకు ప్రశాంతతకు మధ్య జరిగే పోరు ఇది. టైటిల్‌ ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగుతోంది.

గ్రూప్‌-1లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా, నిలకడగా రాణిస్తున్న కివీస్‌ కూడా అటు గ్రూప్‌-2లో అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి..ఒక దాంట్లో ఓడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఇప్పటికే ఓ సారి పొట్టి కప్పు (2010)ను ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్‌.. రెండో టైటిల్‌ అందుకోవాలంటే కివీస్‌ గండాన్ని దాటాల్సి ఉంది. ఇక తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టాలంటే న్యూజిలాండ్‌ శక్తికి మించి శ్రమించక తప్పదు.

కెప్టెన్‌ విలియమ్సన్‌ ప్రశాంత మంత్రమే న్యూజిలాండ్‌కు రక్షగా మారింది.దుర్భేద్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని గొప్పగా కట్టడి చేస్తోంది కివీస్‌. సీనియర్‌ పేస్‌ ద్వయం బౌల్ట్‌, సౌథీతో పాటు మిల్నె, స్పిన్నర్లు సోధి, శాంట్నర్‌ పూర్తిస్థాయిలో రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు తమ పేసర్లతో చెక్‌ పెట్టేందుకు కివీస్‌ సిద్ధమైంది. గప్తిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌, కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తున్నా.. కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి జట్టుది.

బట్లర్‌, బెయిర్‌స్టో, మలన్‌, కెప్టెన్‌ మోర్గాన్‌లతో కూడిన బ్యాటింగ్‌ బలంగా ఉంది. ముఖ్యంగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న బట్లర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టోర్నీలో ఓ సెంచరీ బాదేశాడు. అతనితో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. రాయ్‌ స్థానంలో బిల్లింగ్స్‌ జట్టులోకి వచ్చే ఆస్కారముంది. స్పిన్నర్లు అలీ, రషీద్‌ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అలీ బంతితోనే కాకుండా బ్యాట్‌తో ఎక్కువ విధ్వంసం సృష్టిస్తున్నాడు. పేసర్లు మార్క్‌వుడ్‌, వోక్స్‌, జోర్డాన్‌ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు.