మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స అందిస్తున్నారు.
ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ అస్వస్థకు గురైన విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాళ్లకు పొక్కులు వచ్చి, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నడవలేని స్థితికి రావడంతో హుటాహుటిన 108కు, వైద్యులకు సమాచారం అందించారు.
శుక్రవారం వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్రగా వచ్చిన ఆయన మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈటల ఆక్సిజన్ స్థాయిలు 94-95కు, బీపీ 90/60కి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. షుగర్ లెవల్స్ 265కు పెరిగాయని, ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారని నిర్ధారించారు.