కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు కొత్త తేదీలను ఖరారు చేసింది.
అయితే దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు విషయమై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హార్మిసన్.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచి సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సఫారీలతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పక్కకు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
జట్టు కూర్పు విషయంలో కెప్టెన్‌గా కోహ్లి నిర్ణయాలే కీలకమని..అతనెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్ధం కాదని అన్నాడు. ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసాక ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అశ్విన్‌ను పక్కకు పెట్టిన విషయాన్ని హార్మిసన్ ఉదహరించాడు. తుది జట్టు కూర్పు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం కోహ్లికి కొత్తేమీ కాదని, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసే అస్కారముందని అన్నాడు.