అంచనాలకు అందని క్రికెట్ జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్. ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం కష్టసాధ్యం. ఒక మ్యాచ్‌లో ఉన్నత స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తే.. తరువాతి మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలతారు. అలా అని వారిని తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. టీ20ల్లో పాక్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత ఐదు టీ20 సిరీసుల్లో నాలుగింటిని సొంతం చేసుకుంది. 2009లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను పాక్ గెలుచుకుంది. అయితే ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్లలో టీమిండియా చేతిలో మాత్రం పాక్‌కు ఓటమి తప్పడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు, వన్డే వరల్డ్ కప్‌లో ముఖాముఖిగా ఏడుసార్లు తలపడగా..అన్నింట్లోనూ భారత్ విజయం సాధించింది.
పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌ను గెలవకపోయినా పెద్దగా బాధపడని అభిమానులు..భారత్ చేతిలో ఓటమిపాలైతే మాత్రం ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి అంటుతాయి. టోర్నీని ముగించుకుని వచ్చిన ఆటగాళ్లకు నిరసనలు స్వాగతం పలుకుతాయి. దాయాది దేశాల మధ్య క్రికెట్ పోటీలు జరిగిన చాలాకాలం కావడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దాయాదుల మధ్య పోరు అంటే నరాలు తెగే ఉత్కంఠ. టీమిండియానే అన్ని రంగాల్లోనూ పాక్ కంటే పటిష్ఠంగా ఉంది. అయినా సరే తమ జట్టే గెలుస్తుందనే నమ్మకం పాక్ అభిమానులకు ఉండటానికి ప్రధాన కారణం..పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్. ఐసీసీ టీ20 బ్యాటర్లలో బాబర్ రెండోస్థానం కాగా.. రిజ్వాన్‌ది ఏడో ర్యాంక్. వీరితోపాటు ఫఖర్ జమాన్, అసిఫ్ అలీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు షహీన్ షా అఫ్రిదీ, హసన్ అలీ, మహమ్మద్ హఫీజ్ కీలకం. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణిస్తే పాకిస్థాన్‌ను ఆపడం అంత సులభం కాకపోవచ్చు. అయితే నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో లేకపోవడం పాక్‌కు ఇబ్బందే. ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగనుంది.