ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ

0
112

ఎన్టీఆర్ బయోపిక్‌‌ను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఆయన శనివారం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు సందర్శించారు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ, క్రిష్‌తో పాటు ఎన్టీఆర్ చిత్ర బృందం నిమ్మకూరు చేరుకుంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారు.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ…ఎన్టీఆర్ బయోపిక్ ఏ ఒక్కరికో, ఏ పార్టీకో సంబంధించిందో కాదని అన్నారు. అందరికీ సంబంధించిన చిత్రమని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ చిత్రంలో తమ కుటుంబసభ్యులు కూడా ఉంటారని, అలాగే ఎన్టీఆర్‌కు సంబంధం ఉన్న అన్ని రంగాలవారూ ఈ చిత్రంలో కనిపిస్తారన్నారు.

తన తండ్రి బాల్యంతో పాటు, పలు విషయాలను నిమ్మకూరులోని తమ బంధువులు, తెలిసినవారిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. నిమ్మకూరు సందర్శించగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ గురించి అన్ని తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌తో కలిసి చేయడం సంతోషంగా ఉందన్నారు.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పటి నుంచి ఆయన గురించి రోజుకో చరిత్ర తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ సూర్యుడులాంటవారు అని నిమ్మకూరులో ఆయన బాల్యస్మృతుల్ని చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఖ్యాతి ఏమాత్రం తగ్గకుండా సినిమా తీయడమే తన ఏకైక లక్ష్యమని, పైనుంచి ఎన్టీఆర్ తనను దీవిస్తున్నారని అన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు తెలిపారు.