ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్ ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలితో ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్ లిమిటెడ్ సీఈఓ గౌతమ్ దత్తా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, పూణె, అహ్మదాబాద్ సహా దేశంలోని 35 నగరాల్లో 75కు పైగా పీవీఆర్ స్క్రీన్లలో టీమ్ఇండియా మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచకప్ మ్యాచ్‌లను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పీవీఆర్ సీఈఓ గౌతమ్ దత్తా అన్నారు. సినిమా, క్రికెట్ రెండూ ఎంతో వినోదాన్ని అందిస్తాయన్న గౌతం దత్తా మ్యాచ్‌ను తెరపై చూస్తున్నప్పుడు స్టేడియంలో వీక్షించిన అనుభూతి..అభిమానులకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుండగా థియేటర్లలో వీక్షించే వారికి ఈ మ్యాచ్ మరింత వినోదాన్ని పంచనుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.