టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్‌కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది. అయితే ఈ సిరీస్ రెండు వేదికల్లోనే నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. దేశంలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా బీసీసీఐ టూర్స్, టెక్నికల్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే.. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. “బీసీసీఐ టూర్స్, ఫిక్చర్స్ అండ్ టెక్నికల్ కమిటీ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా.. వెస్టిండీస్‌తో సిరీస్ ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు రెండు మైదానాల్లోనే నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కోల్‌కతా, అహ్మదాబాద్‌ను వేదికలుగా ప్రకటించారు.” అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మూడు వన్డేలను ఒక వేదికగా, మూడు టీ20లను మరో వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ సభ్యులు బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.