క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను..చివరి మ్యాచులోనైనా కివీస్ గెలుస్తుందా?

TeamIndia's eye on clean sweep..will the Kiwis win the last match?

0
86

సొంతగడ్డపై రెండు వరుస విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తూ, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్‌ సేన..మూడో మ్యాచ్‌లోనూ పట్టు వదలకూడదని భావిస్తోంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రయోగాలు చేయడానికి ఈ మ్యాచ్‌ వేదిక కాబోతున్నట్లు తెలుస్తుంది.

కొత్త కెప్టెన్‌, కోచ్‌లు రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌ల నేతృత్వంలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా..హ్యాట్రిక్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ చివరి పోరు ఆదివారమే. టీ20 ప్రపంచకప్‌లో తమను ఓడించడమే కాకుండా ఫైనల్‌ కూడా చేరిన కివీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలతో సిరీస్‌ సాధించడం కచ్చితంగా భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సిరీస్‌ సాధించినప్పటికీ ఉదాసీనతకు తావివ్వకుండా క్లీన్‌స్వీప్‌ సాధించాలని రోహిత్‌ సేన చూస్తోంది.

సిరీస్‌ కోల్పోయినంత మాత్రాన కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శనను మరిచిపోకూడదు. విలియమ్సన్‌, కాన్వే లేకపోవడం బ్యాటింగ్‌లో ఆ జట్టును దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్లో సీఫర్ట్‌, నీషమ్‌ రాణించాల్సిన అవసరముంది. గప్తిల్‌, మిచెల్‌, చాప్‌మన్‌ ఫామ్‌ కొనసాగించడం కీలకం. బౌలర్లు సమష్టిగా సత్తా చాటలేకపోతున్నారు. తొలి మ్యాచ్‌లో బౌల్ట్‌, శాంట్నర్‌.. రెండో టీ20లో సౌథీ రాణించారు. మూడో టీ20లో అయినా బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటాలని కివీస్‌ కోరుకుంటోంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ను కివీస్‌ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.