బిగ్ బాస్ :లవర్స్ పార్క్‌లో తేజస్వి ,సామ్రాట్

బిగ్ బాస్ :లవర్స్ పార్క్‌లో సామ్రాట్

0
64

బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 25వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. మంగళవారం 24వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ లగ్జరీ టాస్క్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటిని బిగ్ బాస్ హాస్టల్‌గా మార్చేశారు. ఇంటి సభ్యుల్లో పది మందిని ఐదు ప్రేమ జంటలుగా, ఇద్దరిని వార్డెన్లుగా, మరో ఇద్దరిని వార్డెన్లకు సెక్యూరిటీ సిబ్బందిగా నియమించారు. హాస్టల్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలను కలవకుండా చేయడమే వార్డెన్ల పని. హాస్టల్‌లో తేజస్వి – సామ్రాట్, భాను – అమిత్, దీప్తి సునైనా – రోల్ రైడా, తనీష్ -నందిని, దీప్తి – కౌశల్‌ జంటలు. గీతా మాధురి, బాబు గోగినేని వార్డెన్లు. వీళ్లకి శ్యామల, గణేష్ సెక్యూరిటీ సిబ్బంది.

24వ ఎపిసోడ్‌లో మొదలుపెట్టిన ఆ ఐదు జంటల ప్రేమాయణం 25వ ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. ముఖ్యంగా ప్రేమపక్షలుగా సామ్రాట్, తేజస్వి జీవించేస్తున్నారు. అస్సలు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండటంలేదు. వార్డెన్ల కళ్లు గప్పి కలుసుకునే ప్రేమజంటల్లో వీళ్లకే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. బిగ్ బాస్ కెమెరా కళ్లు కూడా వీళ్ల మీదే ఎక్కువగా ఉంది. ఎప్పుడు కెమెరాకు కనిపించినా తేజస్వి, సామ్రాట్ అతుక్కుపోయే ఉంటున్నారు. అయితే ఇది టాస్క్‌లో భాగమే అనుకోండి. బిగ్ బాస్ ఇంటిలో ఉన్న ఐదు ప్రేమ జంట్లో వీళ్లదే ది బెస్ట్ అని చెప్పాలి.

ఇక భానుశ్రీ ప్రేమను గెలుచుకోవడానికి అమిత్ అష్టకష్టాలు పడుతున్నాడు. రౌడీలా ఉండే తను భాను కోసం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారిపోతనన్నాడు. తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. మరోవైపు దీప్తి, కౌశల్ జంట కూడా అప్పుడప్పుడు బాగానే కలుసుకున్నారు. ఇదిలా ఉంటే, తనీష్-నందిని, రోల్ రైడా-దీప్తి సునైనా జంటల వ్యవహారం మాత్రం చాలా తేడాగా ఉంది. రోల్ రైడా కవితలు చెప్పి దీప్తి సునైనాకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఆమె దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండటం లేదు. తనీష్ కూడా ఎక్కువ సమయం నందినితో కాకుండా దీప్తి సునైనాతో గడపడం ఆశ్చర్యకరం.

ఓ వైపు లగ్జరీ టాస్క్ నడుస్తుండగానే అమిత్ ఒక్కడినే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. బిగ్ బాస్ ఆదేశం మేరకు అమిత్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లాడు. టాస్క్ ఎలా జరుగుతోందని అమిత్‌ను బిగ్ బాస్ అడిగారు. టాస్క్ చాలా బాగుందని, తామంతా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నామని అమిత్ చెప్పాడు. తాను రౌడీలా, కౌశల్ క్యాబ్ డ్రైవర్‌లా, తనీష్ డెలివరీ బాయ్‌లా ఇలా అందరూ ఒక్కో పాత్రలో నటించి లవర్ మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు. అలాగే నందిని కూడా ఒంటరిగా కన్ఫెషన్ రూమ్‌లోకి బిగ్ బాస్ పిలిచారు. మీకిచ్చిన పాత్రలు ఎలా ఉన్నాయి, నచ్చాయా అని బిగ్ బాస్ అడిగారు. అయితే పాత్రలు బాగున్నాయి కానీ, తనకు సూచించిన జోడీ తనతో ఇంకా సరిగా కలవలేదని చెప్పింది.

నందినికి తనీష్ పర్సనలా..?

తనీష్ తనతో క్లోజ్‌గా ఉండటంలేదని, ఒక లవర్‌గా ప్రవర్తించడంలేదని నందిని తెగ బాధపడిపోయింది. దీప్తి వద్దకు వెళ్లి తన బాధ వెల్లబుచ్చుకుంది. తనీష్‌ను పిలిచి నందినితో సయోధ్య కుదిరేలా దీప్తి మాట్లాడింది. అయితే తనీష్ మాత్రం ‘ఇది టాస్క్ మాత్రమే. దీన్ని పర్సనల్‌గా ఎందుకు తీసుకుంటున్నావ్’ అని ప్రశ్నించాడు. నందిని మాత్రం తల దించుకుని బాధపడుతూనే కనిపించింది. దీప్తి కలుగజేసుకుని ‘ఇంటిలో ఉన్నవాళ్లలో నువ్వే తనకు కనెక్ట్ అవుతున్నావని నందిని భావిస్తోంది. కానీ అదే సమయంలో నువ్వు దూరమవడం తట్టుకోలేకపోతోంది’ అని వివరించింది. ఇది టాస్క్ మాత్రమేనని, పర్సనల్‌గా తీసుకోవద్దని నందినికి నచ్చజెప్పింది.

నిబంధనల ప్రకారం ఇంటిలో బజర్ మోగినప్పుడు ప్రేమ జంటలు గార్డెన్ ఏరియాలోకి వెళ్లడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పారు. కానీ ప్రేమ జంటలు గార్డెన్‌లోకి వెళ్లి ప్రేమించుకోవడానికి ప్రయత్నించాలని కూడా సూచించారు. ప్రేమ జంటలను గార్డెన్ ఏరియాలోకి వెళ్లకుండా వార్డెన్లు, సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించాలని చెప్పారు. ఈ టాస్క్‌లో మంచి ఫన్ క్రియేట్ అయ్యింది. పాత సినిమాల్లో హీరోహీరోయిన్లులా తయారైన తేజు, సామ్రాట్ మళ్లీ అతుక్కుపోయారు. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారిన అమిత్.. తన ప్రేయసి భానుతో గార్డెన్ ఏరియాలోకి డుయెట్‌లు పాడుకున్నాడు. కౌశల్, దీప్తి కూడా ప్రేమాయణం సాగించారు.

లవర్స్ పార్క్‌లోనూ తేజూ, సామ్రాట్‌దే హవా..

లగ్జరీ టాస్క్‌లో భాగంగా లవర్స్ పార్క్ టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటుచేసిన లవర్స్ పార్క్‌లోకి వెళ్లడానికి ప్రేమజంటలు ప్రయత్నించాలని, వాళ్లను వార్డెన్లు ఆపాలని బిగ్ బాస్ సూచించారు. గార్డెన్ ఏరియాలో ఉన్న తెల్లని కంచెను ప్రేమికులు దాటేస్తే వారిని ఎవరూ ఆపలేరని చెప్పారు. ఆ తెల్లని కంచెను ప్రేమికులు దాటకుండా వార్డెన్లు చూసుకోవాలని, ఒకవేళ ప్రేమజంట కంచెను దాటి లవర్స్ పార్కులోకి వెళ్తే వార్డెన్లు పాయింట్లు కోల్పోతారని వివరించారు. ఈ టాస్క్‌లోనూ తేజూ, సామ్రాట్ జంటదే పైచేయి అయ్యింది. వార్డెన్లను దాటుకుని వీళ్లే మొదట లవర్స్ పార్క్‌లోకి వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరూ బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు. తన పుట్టినరోజునాడు తనకు దక్కిన మంచి గిఫ్ట్ సామ్రాట్ అని తేజస్వి చెప్పేసింది. బిగ్ బాస్ వేసిన ‘రావోయి చందమామ’ పాటకు వీళ్లిద్దరూ డ్యాన్స్ కూడా వేశారు. మరి మిగిలిన ప్రేమజంటల ప్రేమాయణం రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు.