ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు..వివరాలివే..

Two new teams in IPL .. details ..

0
90

వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో పాల్గొనే రెండు కొత్త జట్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌, లక్నో వేదికలుగా రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్‌-15వ సీజన్‌ నుంచి మెగా లీగ్‌లో భాగం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం రెండు జట్ల వివరాలను వెల్లడించింది.

లక్నో జట్టును ఆర్పీ- సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ రూ. 7090 కోట్లకు దక్కించుకోగా..అహ్మదాబాద్‌ కోసం ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్‌) రూ. 5,600 కోట్లు వెచ్చించింది. రెండు జట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశించిన బీసీసీఐకి.. ఈ బిడ్‌ల ద్వారా రూ. 12,715 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త జట్ల రాకను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆహ్వానించాడు.

‘ఐపీఎల్‌ మరో రెండు కొత్త నగరాలకు చేరనుంది. వచ్చే సీజన్‌ నుంచి లక్నో, అహ్మదాబాద్‌ మెగాలీగ్‌లో భాగం కానున్నాయి. బిడ్‌లకు మంచి స్పందన వచ్చింది’ అని గంగూలీ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండగా.. 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ‘ఐపీఎల్‌లోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది.

ఇది తొలి అడుగు మాత్రమే. మంచి జట్టును ఎంపిక చేయడంతో పాటు లీగ్‌పై మాదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సంజీవ్‌ గోయెంక పేర్కొన్నారు. గతంలో గోయెంక రైజింగ్‌ పుణే జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.