భారత్ చరిత్రను తిరగరాస్తుందా..?

Will it rewrite the history of India ..?

0
102

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆదివారం కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండు జట్లూ పాకిస్థాన్‌తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్‌ఇండియాకు షాకిస్తున్న న్యూజిలాండ్‌ ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది.

దీంతో తన రికార్డును మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు టీమ్‌ఇండియా 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి గంగూలీ నేతృత్వంలో కివీస్‌ను ఓడించగా.. ఆ తర్వాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. మెగా టోర్నీల్లో భారత్‌ అన్ని ప్రధాన జట్లను మట్టికరిపించినా కివీస్‌ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ కోహ్లీసేన ఓటమిపాలైన విషయం తెలిసిందే. గత 20 ఏళ్లుగా టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ ఆధిపత్యం కొనసాగించగా ఆదివారం నాటి మ్యాచ్ తో దానికి బ్రేక్ వేయాలని కోరుతున్నారు.

మరోవైపు గతేడాది 2020 న్యూజిలాండ్‌ పర్యటనలోనూ టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కేన్‌ విలియమ్సన్‌ జట్టుతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అన్ని జట్లపై ఆధిపత్యం చలాయించిన భారత్‌.. కివీస్‌తో మాత్రం గెలవలేకపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ న్యూజిలాండ్‌ కోహ్లీసేనకు మరోసారి షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగా కివీస్‌ 249 పరుగులు చేసింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 170 పరుగులకే ఆలౌటవ్వడంతో న్యూజిలాండ్‌ 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో గత రెండు దశాబ్దాలుగా న్యూజిలాండ్‌ ఎప్పుడూ భారత్‌కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో కోహ్లీసేన తలపడుతుండటం వల్ల ఇప్పుడైనా విజయం సాధించి 18 ఏళ్ల రికార్డును తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.