ఉన్నత చదువు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోగినేని నాగార్జున ఆకస్మిక మృతితో గొట్టుముక్కల గ్రామంలో విషాదం నెలకొన్నది. జీవితంలో స్థిరపడిన బిడ్డకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్న తల్లి, తోబుట్టువులు నాగార్జున మృతి సమాచారం విని కన్నీరు మున్నీరవుతున్నారు.
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోగినేని వెంకట్రావు, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు యశ్వంత్ హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె పూజితకు వివాహమైంది. చిన్నకుమారుడు నాగార్జున చెన్నైలో బీటెక్ చేశాడు. మధ్యతరగతి కుటుంబం. పెద్దగా ఆస్తులు లేవు. అయినా ఎమ్మెస్ కోసం కుమారుడు నాగార్జునను 2008లో అమెరికా పంపించారు. చదువు పూర్తి చేసుకున్న నాగార్జున ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి వెంకట్రావు అనారోగ్యంతో మృతిచెందారు. నాగార్జున మంచి వేతనంతో అమెరికాలోనే స్థిరపడడంతో కుటుంబం కూడా ఆర్థికంగా కోలుకుంటోంది. త్వరలోనే నాగార్జునకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్ పట్టణంలో ఉంటున్న నాగార్జున మూడు నెలల నుంచి అఫ్టా ఫార్మా ప్లాజ్మాలో పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే అతనికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉన్నారు.
ఆదివారం సాయంత్రం ఆరుగురు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాలపై బయటకు వెళ్లారు. 4.30 గంటల సమయంలో వాటర్‌ఫాల్స్‌కు చేరుకున్నారు. అందరూ అక్కడ ఒక రాయిపై కూర్చొన్నారు. అది పాచి పట్టి ఉండటంతొ నాగార్జున కాలు జారి వాటర్ ఫాల్స్‌లో పడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఉన్న సిమ్మర్స్ కూడా నీళ్లలో దిగినప్పటికీ అతను కనిపించలేదు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ వచ్చి, గాలించి, సుమారు గంటన్నర తర్వాత నాగార్జునను వెలికి తీశారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి మృతిచెందినట్టు నిర్ధారించారు.