Alltimereport : ఈజిప్ట్ (Egypt) రాజధాని కైరోలో ఘోర ప్రమాదం (Cairo Accident) జరిగింది. రద్దీగా ఉన్న రహదారిపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వాళ్లు షాక్ నుంచి తేరుకుని ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే మంటలు పలు వాహనాలను చుట్టుముట్టేశాయి. వెంటనే భయంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కానీ చాలా మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 31 మంది మరిణించగా, మరో 15 మంది తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో దాదాపు 5గురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో బుధవారం ఇంధన ట్యాంకర్ బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
కైరోలోని అల్-వారాక్ ప్రాంతం సమీపంలో రింగ్ రోడ్డుపై ఇంధనంతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకూ మంటలు వ్యాపించాయి. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. రోడ్డుపై ఉన్నవారు హారన్లు మోగిస్తూ, మంటల నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. సమాచారం అందుకున్న అధికారులు 39 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రులకు తరలించారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం(Cairo Accident)లో తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారడంతో డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు.ప్రమాదం జరిగిన వెంటనే ఆరోగ్య శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ఆరోగ్య మంత్రి ఖలేద్ అబ్దెల్ గఫార్ ఘటనా స్థలంతో పాటు సమీపంలోని ఆస్పత్రులను సందర్శించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని, ట్యాంకర్ శిథిలాలను తొలగించారు. అనంతరం రింగ్ రోడ్డును తిరిగి తెరిచారు. వాహనాల రాకపోకలు కూడా క్రమంగా మొదలయ్యాయి.
ప్రమాదంపై విచారణకు ప్రధాని ముస్తఫా మద్బౌలీ ఆదేశించారు. ఇంధన రవాణా సమయంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ప్రమాదానికి అసలు కారణమేంటి? అన్నది తేలిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు తరచూ ప్రాణాలు తీస్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, వాహనాల నిర్వహణ లోపాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఏడాది కూడా 5,200 మందికి పైగా మరణించారు.
Also Read : ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు
Follow Us On: Whatsapp


