Alltimereport : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపు అని సీఎం చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం అందించే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు (Chandrababu) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ప్రభుత్వ పాలనకు గుర్తింపు అని పేర్కొన్నారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ప్రజల ఏకపక్ష తీర్పును ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీల్లో (AP Panchayat Elections) ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించే విషయాన్ని ప్రచారం చేయాలని చెప్పారు.
గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.20 లక్షలు ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ మొత్తాలను వరుసగా రూ.15 లక్షలు, రూ.50 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పార్టీలో నేతల మధ్య పంతాలు, ఈగోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
Also Read : అర్ధనారీశ్వరుడి శిల్పంతో రాహుల్ కొత్త అస్త్రం
Follow Us On: Whatsapp


