Alltimereport : ఆస్ట్రేలియా క్రికెట్‌ను మారోసారి శాండ్‌పేపర్ వివాదం (Sandpaper Controversy) అతలాకుతలం చేస్తోంది. 2018లోనే ఈ వివాదానికి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అది కేవలం ఆస్ట్రేలియ ప్లేయర్ల మధ్య నివురుగప్పిన నిప్పులా ఇంతకాలం ఉందని తాజా వివాదంతో స్పష్టం అయింది. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఖవాజా (Usman Khawaja) రాసిన ‘సబ్ర్’ పుస్తకంతో ఈ వివాదం మరోసారి చెలరేగింది. అందరినీ మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో పడేసింది. తాజాగా దీనిపై ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమన్ (Darren Lehmann) స్పందించారు. ఈ కుట్ర గురించి తనకేమీ తెలీదని స్పష్టం చేశారు. ఆ ఘటన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానని అన్నారు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత అప్పటి కోచ్ లీమన్ రాజీనామా చేశారు.
ఇటీవల ఉస్మాన్ ఖవాజా ఆ వివాదం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. డ్రెస్సింగ్ రూమ్ చర్చల్లో లీమన్ (Darren Lehmann) ఉన్నారని కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ సైతం తన కథనంలో రాశారు. శాండ్‌పేపర్ ఆలోచనను డేవిడ్ వార్నర్ తెచ్చారని బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు లీమన్ ఏబీసీ రేడియోతో మాట్లాడారు. 2018 నాటి తన మాటల్లో మార్పు లేదని తేల్చి చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్ చర్చల్లో తాను ఉన్నట్లు గుర్తులేదని వివరించారు. అప్పట్లో అనేక సమావేశాలు జరిగాయని, అన్నింటిలోనూ తాను లేనని పేర్కొన్నారు.
రివర్స్ స్వింగ్ కోసం బంతిని రుద్దడం వందేళ్లుగా ఉన్నదే అయినా, 2018లో అది హద్దులు దాటిందని అంగీకరించారు. కోచ్‌గా ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ అత్యుత్తమ ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. ఆ ఘటన తర్వాత సాధారణ స్థితికి రావడానికి నాలుగేళ్లు పట్టిందని లీమన్ ఆవేదన చెందారు. ఆ చేదు జ్ఞాపకాల్లోకి మళ్లీ వెళ్లాలనుకోవడం లేదన్నారు. బాన్‌క్రాఫ్ట్ సహా అందరిపై తనకు సానుభూతి ఉందన్నారు. ప్రస్తుత మీడియా కథనాలు చాలా మందిని బాధిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే క్షమాపణలు చెప్పామని, మళ్లీ ఆ బాధలోకి నెట్టవద్దని కోరారు.
Also Read : భారత్ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!
Follow Us On: Whatsapp


