Alltimereport : ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్‌కు చైత్యభూమి పేరు పెట్టనున్న నేపథ్యంలో నాగ్‌పూర్ పేరును దీక్షాభూమి(Deekshabhoomi)గా మార్చాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. 1956 అక్టోబర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాగ్‌పూర్‌లో తన అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఆ ప్రాంతం దీక్షాభూమిగా ప్రసిద్ధి చెందింది. అంబేడ్కర్ జీవితంలో సామాజిక విప్లవం అక్కడి నుంచే మొదలైందని, నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చడం ఆయనకు గొప్ప గౌరవమని రౌత్ పేర్కొన్నారు.
ఇటీవల దాదర్ మెట్రో స్టేషన్ పేరును చైత్యభూమిగా మార్చేందుకు అవసరమైన ప్రక్రియలు చేపడతామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అంబేడ్కర్ అంత్యక్రియలు జరిగిన ప్రాంతం చైత్యభూమి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రౌత్ (Sanjay Raut) డిమాండ్‌కు కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మద్దతు తెలిపారు. నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు. అయితే, రౌత్ ముందుగా దాదర్ మెట్రో పేరు మార్పును స్వాగతించాలని బీజేపీ నేత నవనాథ్ బన్ విమర్శించారు. మరో మంత్రి చంద్రశేఖర్ బావన్కులే నాగ్‌పూర్‌కు ఇప్పటికే దీక్షాభూమి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
Also Read : మైసా’లో రాములమ్మ గర్జన!
Follow Us On: Whatsapp


