Alltimereport : అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి ఆగ్రహానికి బలయ్యేది చివరకు సామాన్య ఉద్యోగులేనా? విధి నిర్వహణలో భాగంగా ఐడీ కార్డు అడిగినందుకు ఐదుగురు చిరుద్యోగులు తమ ఉపాధి కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రా (IAS Kartikeya Mishra) ప్రయాణిస్తున్న వాహనం టోల్ గేట్ వద్దకు వచ్చింది. డ్రైవర్ టోల్ మినహాయింపు కోరడంతో.. సిబ్బంది గుర్తింపు కార్డు చూపించాలని కోరినట్లు తెలుస్తోంది. వాహనంపై అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, సిబ్బందికి అందులో ఉన్నది ఎవరో స్పష్టంగా తెలియకపోవడంతో వారు నిబంధనల ప్రకారం ఐడీ అడిగినట్లు సమాచారం.
అయితే, సీఎంవో కార్యదర్శినైన తననే గుర్తింపు కార్డు అడుగుతారా అంటూ కార్తికేయ మిశ్రా (IAS Kartikeya Mishra) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెల్లువెత్తాయి. టోల్ ఇంచార్జ్ క్షమాపణలు చెప్పినా అధికారి ఆవేశం తగ్గలేదని, అనంతరం సంబంధిత అధికారులను, టోల్ నిర్వాహకులను పిలిపించి ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఐదుగురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్ వైజర్, ఒక షిఫ్ట్ ఇంచార్జ్ ఉద్యోగాలు కోల్పోయినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
క్షమాపణలు చెప్పినా శిక్ష తప్పలేదు!
తమ విధులను సక్రమంగా నిర్వర్తించడమే ఆ చిరుద్యోగులు చేసిన తప్పా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరితో బీబీసీ మాట్లాడగా.. వాహనంలో ఉన్నది సీఎంఓ కార్యదర్శి అని డ్రైవర్ చెప్పినప్పటికీ, సాధారణంగా చాలామంది ఇలానే ఏదొకటి చెబుతుంటారని, నిర్ధారించుకునేందుకు ఐడీ కార్డు అడిగినట్లు వివరించారు. పొరపాటున వాహనాన్ని ఆపినందుకు ఎన్నిసార్లు క్షమాపణ కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టోల్ నిర్వహణ సంస్థ, NHAI అధికారుల స్పందన కీలకంగా మారనుంది. మరోవైపు ఐఏఎస్ కార్తికేయ మిశ్రా నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఒకవైపు ఉన్నతాధికారుల హోదా, మరోవైపు కుటుంబాలను పోషించుకునేందుకు ఉద్యోగాలు చేస్తున్న చిరుద్యోగులు బతుకులు.. అధికార వ్యవస్థలో బాధ్యత, మానవీయతపై చర్చకు దారితీస్తోంది.


