టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్న విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహణ లేకుండా, బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలవకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్(Minister KTR) అన్నారు. గుజరాత్‌లో 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీక్ అయ్యాయని గుర్తుచేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో వ్యక్తి చేసిన తప్పును వ్యవస్థపై రుద్దడం సరికాదని అన్నారు. మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్‌నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని మండిపడ్డారు.
Read Also: ‘ఏపీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే’
Follow us on: Google News