మళ్ళీ కాంగ్రెస్ లోకి రానున్న డీఎస్.. ముహూర్తం ఫిక్స్

మళ్ళీ కాంగ్రెస్ లోకి రానున్న డీఎస్.. ముహూర్తం ఫిక్స్

0
121
d srinivas
d srinivas

కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పని చేసి టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్ కు కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అయితే ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎస్… టీఆర్ఎస్ లో మాత్రం ఉక్కపోతకు గురయ్యారు. దీనికి తోడు ఆయన చిన్నకుమారుడు అరవింద్ బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ లోనూ డీఎస్ కు అవమానాలు ఎదురయ్యాయి.

తనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన డీఎస్… త్వరలోనే టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలనే ఆలోచనతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకుంటే ఎక్కడికి వెళతారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన తనయుడు ఉన్న బీజేపీలోకి డీఎస్ వెళతారా లేక తన స్వగృహమైన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తారా అనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తన అనుచరులతో రహస్యం సమావేశం నిర్వహించిన డీఎస్… త్వరలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. డీఎస్ తో సమావేశమైన ఆయన అనుచరులు చాలామంది మళ్లీ ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిద్దామని వారికి వివరించిన డీఎస్… కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే మంచిదనే ఆలోచనతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో డీఎస్ టచ్ లో ఉన్నారని… అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 16న ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేయడం కోసం ఆ పార్టీకి చెందిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు… డీఎస్ ను కూడా తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి చర్చలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

అయితే తన తనయుడు బీజేపీలో ఉండి తాను కాంగ్రెస్ లో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న డీఎస్… తనతో పాటు తన కుమారుడు అరవింద్ ను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్… త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.