నేడే ఇండియా- స్కాట్లాండ్‌ పోరు..భారీ తేడాతో భారత్ గెలవగలదా?

India-Scotland war today..can India win by a huge margin?

0
84

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్​, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవి చూసిన భారత్‌..అఫ్గానిస్థాన్​ను 66 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీస్‌కు చేరడం తమ చేతిలో లేకపోయినా సాంకేతికంగా ఇంకా సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండటం వల్ల స్కాట్లాండ్‌, నమీబియాపై భారీ విజయాలు నమోదు చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. స్కాట్లాండ్‌పై పోరుకు సిద్ధమైంది టీమిండియా. దుబాయ్‌ వేదికగా శుక్రవారం ఈ పోరు జరగనుంది.

దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో మ్యాచ్​లో టీమ్​ఇండియా మరో భారీ విజయాన్ని నమోదు చేసిన నెట్​రన్‌రేట్‌ను పెంచుకోవాలని భావిస్తోంది. గ్రూప్‌-2 నుంచి వరుసగా నాలుగు విజయాలతో పాకిస్థాన్​‌ ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా..రెండో బెర్త్‌ కోసం పోటీ నెలకొంది. న్యూజిలాండ్‌ ఆడే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై భారత్ సెమీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమ్​ఇండియా రన్‌రేట్‌ ప్రస్తుతం 0.073గా ఉంది. స్కాట్లాండ్‌, నమీబియాలపై గెలవడం భారత్‌కు కష్టమేం కాదు. కానీ కివీస్‌ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడాలంటే మాత్రం అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ప్రధానంగా అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పైనే పడ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్‌ ఓటమిపాలై భారత్‌ ముందుకు సాగాలని ఆశిస్తున్నారు.

పాక్, కివీస్​పై పెద్ద ప్రభావం చూపని భారత బౌలర్లు అఫ్గాని‌స్థాన్​పై రాణించారు. ముఖ్యంగా నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ ఆడిన స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అశ్విన్‌తో పాటు బూమ్రా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా రాణిస్తే స్కాట్లాండ్‌పై భారీ విజయం నమోదు చేయవచ్చని భారత్‌ భావిస్తోంది.

పాకిస్థాన్, న్యూజిలాండ్‌పై పెద్దగా ప్రభావం చూపని భారత బ్యాటర్లు..అఫ్గానిస్థాన్​పై ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఈ ప్రపంచకప్‌లో 210 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశారు. స్కాట్లాండ్‌పై కూడా భారత బ్యాటర్లు అదే విధంగా రాణించాలని జట్టు కోరుకుంటోంది. అఫ్గాన్‌తో పోరులో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చి శతకానికిపైగా భాగస్వామ్యం నమోదు చేయగా రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించారు. వీరిలో పాటు విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది.